ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని వేడుకోలు…

ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని వేడుకోలు…

  • ఆందోళనలో అన్నదాతలు…
  • వర్షానికికూలుతున్నఇండ్లు…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా(Narayanpet District) ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో చేతికొచ్చిన పత్తి, వరి పంటలు వర్షాల కారణంగా నేలమట్టం కావడంతో రైతన్నల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి, కంది, వరి పంటలు దెబ్బతిన్నాయి.

వానాకాలంలో సాగుచేసిన వివిధ పంటల పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితులు లేవని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట(cotton crop) చేతికి వచ్చి వ్యవసాయ పొలాల్లో రైతులు పత్తి తొలగిస్తున్న తరుణంలో వర్షాల కారణంగా చేతికొచ్చిన పత్తి పంట వర్షార్పణం కావడంతో కర్షకుల పరిస్థితి అయోమయంగామారింది. ఊట్కూర్ మండలంలో ఈ ఏడాది రైతులు అధిక శాతం పత్తి పంట సాగు చేయగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల తడిసి పంట దెబ్బతింటుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాల కారణంగాఊట్కూర్ మండల(Ootkur Mandal) కేంద్రంలోని కుర్వగేరి వీధికి చెందిన కుర్వ మల్లేష్, శ్రీ కృష్ణనగర్ వీధికి జాజాపురం పద్మమ్మ ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఊట్కూర్ మండలంలో సోమవారం రాత్రి 22.6 మీ మీ వర్షపాతం నమోదు కాగా ఈ రోజు 4మీ మీ వర్షపాతం నమోదైనట్లు ఏ ఎస్ ఓ చేతన్(ASO Chetan) తెలిపారు. ఈదురు గాలుల‌కు వర్షానికి వరి పంట నేలకూలడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. వర్షాలు ఈదురుగాలులకు పంటలు నష్టపోయిన రైతులను, ఇండ్లు కూలిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply