వ్యాపార విస్తరణకు సింగరేణి అడుగులు

వ్యాపార విస్తరణకు సింగరేణి అడుగులు

  • కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై ఫోకస్
  • జవహర్లాల్ నెహ్రూ రీచెస్ సెంటర్తో ఒప్పందం
  • ఓబి, యాష్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతకు పరిశోధన

గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమ యాజమాన్యం ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపార విస్తరణకు అడుగులు మరింత ముందుకు వేస్తుంది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల ఓబి మట్టి నుండి అదేవిధంగా ఫ్లై యాష్(Fly ash) లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో కీలక ఖనిజాలు ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది. వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ వివిధ పరిశోధన సంస్థలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ మేరకు ఈ రోజు మహారాష్ట్ర(Maharashtra) నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర గనుల శాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్ తో కంపెనీ ఒప్పందం చేసుకుంది. కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికి, విస్తరణ తదితర అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి సమాచారం అందించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిసి పనిచేయడానికి పరిశోధనా సంస్థతో ఒక ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్ సింగరేణి భవన్ లో సీఎండీ ఎన్.బలరామ్(CMD N. Balaram) సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్(పి అండ్ పి) కె.వెంకటేశ్వర్లు, పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ అగ్నిహోత్రి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఒప్పందం ఉద్దేశాలను వివరించారు. సింగరేణి సంస్థ(Singareni Company) పెద్ద ఎత్తున దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ చర్యలు చేపట్టాలని నిర్ణయించిందని, వీటిలో కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పైన ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కీలక ఖనిజాలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పరిశోధన రంగంలో దశాబ్దాల అనుభవం గల ప్రభుత్వ పరిశోధనా సంస్థలతో సాంకేతిక సహాయం, పరస్పర సహకారంతో వ్యాపార భాగ్యస్వామ్యంతో ముందుకు వెళ్లేందుకు నిర్ణయించామన్నారు.

తాము ఒప్పందం కుదుర్చుకున్న జేఎన్ ఏఆర్‌డీసీ సంస్థ(JNARDDC Company) అల్యూమినియం రంగంలోనూ, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కీలక ఖనిజాలపై పరిశోధనలు చేస్తూ పలు జాతీయ సంస్థలకు సాంకేతిక సహాయం అందిస్తోందని… అలాగే ఈ రంగాలలో వర్క్ షాపులు, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.

దేశంలోనే కాక విదేశాలలో కూడా సింగరేణి సంస్థ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో పరిశోధనలకు ఖనిజాల ఉనికి తదితర అంశాలు కచ్చితంగా నిర్ధారించుకోవడానికి ఈ పరిశోధన సంస్థ సహకారాన్ని తీసుకుంటామన్నారు. సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో లభ్యమయ్యే ఓవర్ బర్డెన్(Overburden) లో, ఎస్టీపీపీలోని ఫ్లైయాష్ లో సింగరేణి సమీప ప్రాంతాల్లోని గుట్టల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికి ప్రాథమికంగా నిర్ధారించబడిందని, దీనిపై లోతుగా పరిశీలించడానికి ఈ సంస్థ సహకారం తీసుకుంటామన్నారు.

భూ విజ్ఞాన శాస్త్రం, ఖనిజ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి , శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. వారి పరిశోధన శాలలను కూడా వినియోగించుకోవడానికి వీలుంటుందన్నారు. ఈ సందర్భంగా పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ అగ్నిహోత్రి(Dr. Anupam Agnihotri) మాట్లాడుతూ.. సింగరేణి తో ఒప్పందం కుదరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సింగరేణికి మైనింగ్ లో అపారమైన అనుభవం ఉందని, ఈ అనుభవంతో కీలక ఖనిజ రంగంలోనూ కచ్చితంగా రాణించగలదని అభిప్రాయపడ్డారు. తమ ఒప్పందం పరస్పరం లాభదాయకంగా ఉంటుందన్నారు.

Leave a Reply