తుఫాను విధుల్లో తిరుపతి పోలీసులు
తుఫాను విధుల్లో తిరుపతి పోలీసులు
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : తుఫాను ప్రభావం నేపథ్యంలో తిరుపతి జిల్లా (Tirupati District) వ్యాప్తంగా పోలీసులు పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి మండలం, గ్రామ స్థాయిలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ, ఫైర్, ఎన్‌డిఆర్‌ఎఫ్, విద్యుత్, వైద్య, ఇతర శాఖల సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తున్నారు. వర్షాలు, గాలివానల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ప్రమాద ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ (Traffic control), భద్రతా చర్యలు, అవసరమైన చోట ఖాళీ చేయింపు పనులు చేపట్టాయి.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు (SP Subbaraidu) ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ—తుఫాను సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లరాదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. అలాగే తుఫాను సమయంలో తప్పుడు సమాచారం, పుకార్లు నమ్మరాదని, అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రత కోసం అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
