అంగన్వాడీ టీచర్ ను విచారించిన సిడీపీఓ

అంగన్వాడీ టీచర్ ను విచారించిన సిడీపీఓ

కిరాణ దుకాణ యజమానికి గుడ్లు ఇచ్చిన అంగన్వాడి టీచర్ కు మెమో జారీ

భీమ్ గల్ ప్రాజెక్ట్ ఐసిడిఎస్సి డీపీఓ స్వర్ణలత

కమ్మర్ పల్లి,అక్టోబర్ 13 ( ఆంధ్ర ప్రభ ):- రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం కోసం అందిస్తున్న కోడిగుడ్లు పక్కదారి పడుతున్నాయి..

అంగన్వాడి కేంద్రాలలో ఉండాల్సిన కోడిగుడ్లు కిరాణ దుకాణలలో దర్శనమిస్తున్నాయి.తెల్లగా మెరిసిపోతున్న గుడ్ల పై ఎర్రని రంగులో ఉన్న తెలంగాణ సర్కార్ ముద్ర కొట్టచ్చినట్లు కనబడుతుంది.

కొందరు కిరాణ దుకాణల్లో తక్కువ ధరకు యథేచ్చగా అమ్మేస్తున్నారు. ఎవరు అడుగుతారు లే అన్న ధైర్యమో..ఏమో..కానీ..కిరాణ దుకాణల్లో అంగన్వాడి గుడ్లు అమ్మడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఐసిడీఎస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అంగన్వాడి టీచర్ ను విచారించారు.అంగట్లో అంగన్వాడి గుడ్లు అనే శీర్షిక ఆదివారం ఆంధ్ర ప్రభ దిన పత్రిక జిల్లా సంచికలో ప్రచురితమైన కథనానికి భీమ్ గల్ ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సీడీపీఓ స్వర్ణలత ఆధ్వర్యంలో ఏసిడిపిఓ జ్ఞానేశ్వరి, సూపర్వైజర్ గంగహంస లు అంగన్వాడి కేంద్రం కోడ్ నెంబర్ 1803168 ను సందర్శించి విచారించారు.

అంగన్వాడి కేంద్రంలో లబ్ధిదారులు కాని వారికి 10 గుడ్లు ఇచ్చినట్లు అంగన్వాడీ టీచర్ ఒప్పుకోవడంతో అంగన్వాడీ టీచర్ కు ఐసిడిఎస్ సిడిపిఓ స్వర్ణలత మెమో జారీ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ టీచర్ పై తదుపరి శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.