గాజులరామారంలో ప్రభుత్వ భూమి రక్షించాం

గాజులరామారంలో ప్రభుత్వ భూమి రక్షించాం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : గాజులరామారంలో కొందరు రౌడీషీటర్లు(Rowdy sheeters) ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, నిన్నఅక్కడ ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలనే తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూమిలోని 260 అక్రమ కట్టడాలను తొలగించామన్నారు. ఇందులో నకిలీ పట్టాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టినట్లు తాము గుర్తించామని చెప్పారు.
హైదరాబాద్‌లో ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు(Government Lands) రక్షించినట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయన్నారు. ఆరు చెరువులకు పూర్తిగా పునరుజ్జీవం కల్పించినట్లు వివరించారు. గాజులరామారంలో 51 డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని, త్వరలోనే 72కు పెంచుతామని చెప్పారు. నగరంలో 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయన్నారు.
నాలాల వద్ద ఆక్రమణలు గుర్తించి తొలగిస్తున్నామని కమిషనర్ తెలిపారు. వాటిలో పూడిక తొలగింపును ముమ్మరం చేశామన్నారు. వర్షం నీరు చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి, నీరు నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు. కాంక్రీటైజేషన్(concretisation) వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదని, అధిక కాలుష్యం(pollution) వల్ల నగరాల్లోనే వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని చెప్పారు. భవిష్యత్ అంతా యువతరానిదే కాబట్టి పార్కులు, చెరువుల గురించి జాన్ జడ్ ఆలోచించాలి అని రంగనాథ్ సూచించారు.
