Andhra Pradesh Natural Farming | 21 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ నమూనా

Andhra Pradesh Natural Farming | 21 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ నమూనా

Andhra Pradesh Natural Farming | రైతులు, గ్రామీణ మహిళల అంకితభావానికి ప్రపంచ గుర్తింపు
ప్రకృతి సాగుతో అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం
దేశానికే గర్వకారణమన్న మంత్రి అచ్చెన్నాయుడు

Andhra Pradesh Natural Farming | అమరావతి, ఆంధ్రప్రభ: ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రానికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ వేదికగా మరోసారి రాష్ట్ర గౌరవం ఖ్యాతికెక్కింది. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం సాగుతున్న తీరు యావత్తు విశ్వాన్నే ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్-2026 ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి లభించింది. ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపుతో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.

స్వీడన్‌లోని బస్తాద్ నగరంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహణ అధికారి తల్లం విజయ్ కుమార్ పాల్గొని ఈ అవార్డును స్వీకరించారు. ప్రపంచ ఆహార వ్యవస్థలో పర్యావరణ అనుకూల మార్పులకు దోహదపడుతున్న వినూత్న కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశంలో దశాబ్దం క్రితం ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతిపెద్ద వ్యవసాయ కార్యక్రమాలలో ఒకటిగా ఎదిగింది.

21 రాష్ట్రాలకు ఆదర్శం

ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను అమలు చేయడం ద్వారా వాతావరణ మార్పులు, పర్యావరణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఏపీసీఎన్ఎఫ్ నిరూపించింది. ప్రకృతి వ్యవసాయం రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని అందించడమే కాకుండా నేల సారాన్ని పెంపొందించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తోంది.

ప్రస్తుతం ఈ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు శ్రీలంక, జాంబియా దేశాల్లోనూ అమలవుతుండటం ఆంధ్రప్రదేశ్ రూపొందించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ఆచరణీయమని నిరూపిస్తోంది. ముఖ్యంగా మహిళల నాయకత్వం ఈ ఉద్యమ విజయానికి ప్రధాన బలంగా నిలుస్తోంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళలు కుటుంబ స్థాయిలో ఆలోచనా విధానంలో మార్పు తీసుకువచ్చి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్న 10 వేల మందికిపైగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల సేవలు అభినందనీయం. ప్రకృతి వ్యవసాయ శాస్త్రాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న 1,000 మందికిపైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికిపైగా రైతు పరిశోధకుల సేవలను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

దేశానికే గర్వకారణం

ఈ విజయం రాష్ట్రానికే కాక దేశానికీ గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపుతో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, రాష్ట్ర ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి, రైతులు, గ్రామీణ మహిళల అంకితభావంతో కూడిన కృషికి ప్రపంచ వేదికపై లభించిన గౌరవమే ఈ పురస్కారమని మంత్రి వివరించారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, గ్రామీణ మహిళలు, ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

విజయ ప్రయాణంలో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, క్షేత్రస్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, సిబ్బంది అందించిన సహకారం అమూల్యమని మంత్రి అన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు ద్వారా ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ ఉద్యమాన్ని విశ్వసించి అభివృద్ధికి తోడ్పడిన ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply