త్వరలో జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి

త్వరలో జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి
- నాలుగేళ్లలో ఏటా 1,000 టన్నులు
- దక్కన్ గోల్డ్ మైన్స్ ఎండీ హనుమ ప్రసాద్
(ఆంధ్రప్రభ, తుగ్గలి ) : కర్నూలు (Kurnool) జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుండి త్వరలో బంగారు ఉత్పత్తి ప్రారంభమవుతుందని జొన్నగిరి దక్కన్ గోల్డ్ మైన్స్ (Jonnagiri Gold Mines) లిమిటెడ్ (డీజీఎంఎల్) కంపెనీ ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు.ఈ ఏడాది జూన్- జూలై నెలల్లో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే త్వరలోనే జొన్నగిరి గని నుంచి పసిడి ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రసాద్ చెప్పారు.
ఇదే జరిగితే మన దేశంలో గనుల నుంచి పసిడి తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా డీజీఎంఎల్ (DGML) రికార్డు సృష్టించనుంది. కాగా ప్రారంభంలో జొన్నగిరి గని నుంచి ఏటా 750 కిలోల పసిడి ఉత్పత్తి చేయవచ్చని డీజీఎంఎల్ భావిస్తోంది. తర్వాత రెండు- మూడు సంవత్సరాల్లో ఇది 1,000 టన్నులకు చేరే అవ కాశం ఉందని ప్రసాద్ తెలిపారు.
ప్రస్తుతం మన దేశంలో ఏటా 1.5 టన్నులకు మించి పసిడి ఉత్పత్తి కావడం లేదు. దీంతో పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేసి ఏటా దాదాపు 1,000 టన్నుల పసిడి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. జొన్నగిరి (Jonnagiri) గనుల్లో డీజీఎంఎల్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంబిస్తే ఈ భారం భారీగా తగ్గనుంది. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, ఉద్యోగ నియామకాలు కూడా పూర్తి చేశామని హనుమ ప్రసాద్ తెలిపారు.
