- గ్రామీణ స్వచ్య్ అభియాన్ నిధులొచ్చాయి
- కపామర్రు… ఐలూరు రోడ్లు
- డ్రెయినేజీపై దృష్టి పెట్టండి
- డాన్స్ కోర్సులతో ఆకట్టుకోండి
- కూచిపూడి ఆహార్యం.. మార్కెటింగ్ పై ఫోకస్ పెట్టండి
- అధికారులతో కలెక్టర్ డీకే బాలాజీ
ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి : కూచిపూడి గ్రామాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ లోని తన చాంబర్లో డిఆర్ఓ కే.చంద్రశేఖరరావుతో కలిసి కూచిపూడి గ్రామ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…… రాష్ట్రీయ గ్రామీణ స్వచ్చ్ అభియాన్ కింద కూచిపూడిలోని ఆయా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని, ప్రతిపాదించిన పనులకు అంచనాలు తయారు చేసి సమర్పించాలన్నారు. పామర్రు నుంచి కూచిపూడి, అదేవిధంగా కళాక్షేత్రం యూనివర్సిటీకి చేరుకునే ఐలూరు రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామంలోని డ్రైనేజీ మరమ్మతులను చేపట్టాలని అందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేస్తామన్నారు. రెగ్యులర్ నృత్య కోర్సులతో పాటు సెలవుల్లో రోజుల్లో వారాలు, నెలల షార్ట్ కోర్సులు నిర్వహించే విధంగా చూడాలని, తద్వారా ఎక్కువ మందిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నారు.
గతంలో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను గుర్తించి కళాక్షేత్రం అభివృద్ధికి సహకారం కోరాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కూచిపూడి గ్రామ మహిళలు తయారు చేసిన కూచిపూడి నృత్య దుస్తులు, జడలు, గజ్జలు తదితర వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ క్రమంలో ఆయన కళాక్షేత్ర యూనివర్సిటీకి ఉపకులపతిని నియమించాలని ఫోన్ ద్వారా ఉన్నతాధికారులను కోరారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ కెపాసిటీ బిల్డింగ్ ఏడి లజవంతి నాయుడు, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి రామ లక్ష్మణరావు, కన్సల్టెంట్ సాహితి, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్, మొవ్వ ఎంపీడీవో డి సుహాసిని, తహసీల్దారు మస్తాన్ పాల్గొన్నారు.

