సిక్స్ తో ముగించిన కెప్టెన్ !!

దుబాయ్ : ఆసియా కప్ టీ20 2025లో భారత్ మరోసారి పాకిస్థాన్‌పై తన గర్జన వినిపించింది. ఆదివారం జరిగిన హై వోల్టేజ్ పోరులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంకా 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరిన భారత్, పాకిస్థాన్‌కు ఏ మాత్రం తావివ్వకుండా తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది.
బౌలింగ్‌లో ఆధిపత్యం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ కు, భారత్ మొదటి బంతి నుంచే చుక్కలు చూపించింది. హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్‌లో సైమ్ అయూబ్ డకౌట్ కాగా, ఆ తర్వాత బుమ్రా మరో కీలక బ్యాటర్ మొహమ్మద్ హారిస్‌ను పెవిలియన్ చేర్చాడు. భారత బౌలర్ల దూకుడు ముందు పాక్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా తలవంచారు.
చివరిలో షాహీన్ అఫ్రిది (16 బంతుల్లో 33 నాటౌట్) పోరాడటంతో పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ 127/9 కు చేరుకోగలిగింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (44 బంతుల్లో 40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3/18) అద్భుత ప్రదర్శన చేయగా, బుమ్రా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్, వరుణ్ చెరో ఒక వికెట్ తీసి పాకిస్థాన్‌ను కట్టడి చేశారు.
బ్యాటింగ్‌లో విధ్వంసం..
128 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ధాటిగా ప్రారంభించారు. అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31) విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు మంచి శుభారంభం అందించగా… శుభ్‌మన్ గిల్ (10) త్వరగానే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్), తిలక్ వర్మ (31 బంతుల్లో 31) కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపించారు. తన పుట్టినరోజు నాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివర్లో భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించి అభిమానులకు అద్భుతమైన బహుమతిని ఇచ్చాడు.
చరిత్ర పునరావృతం..
ఈ విజయంతో భారత్, పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన 14 టీ20 మ్యాచ్‌లలో భారత్ 11 గెలుచుకోగా, పాకిస్తాన్‌కు కేవలం 3 విజయాలు మాత్రమే దక్కాయి. ఈ గెలుపు భారత జట్టు సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.
