వ్యాలీ యూనివర్సిటీలో కాల్పులు..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు షాక్ తగిలింది. తన సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) (Charlie Kirk) హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు గన్‌తో కాల్పులకు దిగాడు. దీంతో గాయపడిన చార్లీ కిర్క్ కు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అమెరికాలో మాస్ షూటింగ్పై వర్సిటీలో చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు. ఓ టెంట్లో అతడు కూర్చొని ఓ విద్యార్థి ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే పోలీసులు కిర్క్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరించారు.
ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. నిందితుడు కిర్క్ మెడ భాగంలో కాల్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వెంటనే కిర్క్ కుప్పకూలిపోయాడు. ఈఘటనతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు.
తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని ట్రంప్ తన సోషల్ మీడియాలో చెప్పారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు.
ట్రంప్ సన్నిహితుడుగా పేరున్న కిర్క్ 18 ఏళ్లకే టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ ఆర్గనైజేషన్ను స్థాపించారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో తన కార్యక్రమానికి ముందు అతను వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కిర్క్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ 1000 మంది సంతకాలతో కూడిన ఫిర్యాదు యూనివర్సిటీకి అందింది. అయితే తాము భావ ప్రకటన స్వేచ్ఛకు, నిర్మాణాత్మక చర్చలు మద్దతు ఇస్తామని, కార్యక్రమాన్ని రద్దు చేయలేమని సదరు యూనివర్సిటీ పేర్కొంది.
