ఇసుక మేటల తొలగింపునకు ప్రత్యేక నిధులు

నిజామాబాద్, ఆంధ్రప్రభ : కామారెడ్డిలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని, భారీగా నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ రోజు ఆయన కామారెడ్డి జిల్లాలో వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో ఆయన మాట్లాడుతూ.. పొలాల్లో వేసిన ఇసుక మేటల (sand dunes)ను తొలగించడానికి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా నిచ్చారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు (irrigation project)కు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పోచారం ప్రాజెక్టు (Pocharam project) వరదలకు తట్టుకుని నిలబడి ప్రజల ప్రణాలను కాపాడిందని తెలిపారు. తక్షణమే ఆ ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేశామని గుర్తు చేశారు.
భవిష్యత్తులో వరదతో నష్టం జరగకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాని అన్నారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. దెబ్బతిన్న రహదారులు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేసేందుకు కావాల్సిన నిధులపై నివేదిక రూపొందించాలని సూచించారు. అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని, క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తి స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
