అబద్ధాలతోనే కాంగ్రెస్ కాలయాపన
- స్థానిక ఎన్నికల్లో 46 శాతం రిజర్వేషన్లు
- తెలంగాణలో యూరియా కొరత లేదు
- మూడు వేల కోట్లతో నిజామాబాద్-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వే లైన్
నిజామాబాద్ బ్యూరో : అబద్దాలతోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు (N Ramchander Rao) అన్నారు. ఈ రోజు ఇందూర్‌లోని బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతుబంధు బంద్ అయిందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో అనేక వాగ్దానాలు చేసి మాట తప్పిందని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని, రైతు భరోసా సరిగ్గా ఇవ్వలేదని చెప్పారు. ఓటు చోరీతోనే బీజేపీ గెలుస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారని, ఏ ఓటర్ లిస్టుతో బీజేపీ సభ్యులు గెలిచారో, అదే లిస్టుతో కాంగ్రెస్ నాయకులు కూడా గెలిచారన్నారు. ఏ యంత్రాంగం ఎన్నికలు నిర్వహించిందో, అదే యంత్రాంగం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా 8 ఎంపీలను గెలిపించుకుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో 46 శాతం రిజర్వేషన్లు..
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్, మరోవైపు పది శాతం మతపరమైన రిజర్వేషన్లు (Reservations) ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తోందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో 46 శాతం రిజర్వేషన్లు బీజేపీ తరఫున బీసీలకే ఇస్తామని, ఎందుకంటే బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలన్నారు.
తెలంగాణలో యూరియా కొరత లేదు..
కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత (Urea deficiency) అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రామచందర్ రావు అన్నారు. బీజేపీ ఎక్కడా కూడా యూరియా పంపిణీని ఆపలేదని, తెలంగాణకు అవసరమైనంత మేరకు యూరియా సరఫరా చేసిందని, తెలంగాణలో నడుస్తోంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ యూరియా కొరత మాత్రమే అని అన్నారు. తాను పలు జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో మాట్లాడానని, ఎక్కడా కూడా యూరియా కొరత లేదని వారు చెప్పారు.
రైతులకు బేడీలు వేసింది.. బీఆర్ఎస్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం బీఆర్‌ఎస్ అని, రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగినది కూడా బీఆర్‌ఎస్ పాలనలోనే అని, అందుకే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని రామచందర్ రావు అన్నారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తున్నారని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ తో పాటు బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు.
మూడు వేల కోట్లతో నిజామాబాద్-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వే లైన్
రైల్ కనెక్టివిటీని బలపరిచే దిశగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో నిర్మాణం చేపట్టిందని రామచందర్ అన్నారు. అనేక జాతీయ రహదారుల నిర్మాణం (Construction of national highways) కూడా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రామీణ పేదలకు ఉచిత బియ్యం, మరుగుదొడ్లు, యువతకు స్వయం ఉపాధి రుణాలు.. ఇవన్నీ కేంద్ర నిధులతోనే అమలు చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ (Congress party) ని రానున్న ఎన్నికల్లో ఓడించి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
