కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులు విడుదల చేయాలి..
- పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరికీ తక్షణమే ఆర్థిక సహాయం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్నప్పటికీ నిధులు అందక ఎదురుచూస్తున్న లబ్ధిదారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పథకాలను కొనసాగించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
