బీఆర్ఎస్ నేత డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్

బీట్‌ ఆఫీసర్‌ బానోత్‌ నవీన్‌ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం అందించాలి
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ ఉద్యోగికి అధికారిక గౌరవం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న
పోలీసు, అటవీశాఖ సిబ్బందికి వేర్వేరు విధానాలు ఉండకూడదన్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌ బానోత్‌ నవీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఒకే యూనిఫాం ధరించి ప్రజాసేవ చేస్తున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం వేర్వేరు విధానాలు అవలంబించకూడదని ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ నెల 11న వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి బీట్‌ ఆఫీసర్‌ బానోత్‌ నవీన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారని డా. ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

అధికారిక లాంఛనాలపై ప్రశ్నలు

నవీన్‌ మృతిపై జిల్లా అటవీ అధికారులు అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారని, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కూడా సంతాపం ప్రకటించారని ఆయన తెలిపారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై డా. ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నలు లేవనెత్తారు.

“మంత్రి లేఖ రాసినా ఎందుకు స్పందించలేదు? దీనికి కారణం ఏమిటి?” అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

అటవీశాఖ ఉద్యోగుల పట్ల వివక్ష చూపొద్దు

అటవీశాఖ ఉద్యోగులు కూడా రాష్ట్ర రక్షణలో భాగంగానే పనిచేస్తున్నారని డా. ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే బీట్‌ ఆఫీసర్లు అనేక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలో విధి నిర్వహణలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇంటి స్థలం వంటి సహాయాలు అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

“పోలీసు శాఖకు ఒక న్యాయం, అటవీశాఖకు మరో న్యాయం ఎందుకు? ఇది వివక్ష కాదా?” అని ప్రశ్నించారు.

నవీన్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అయినా బీట్‌ ఆఫీసర్‌ నవీన్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆశించామని, కానీ ఇప్పటివరకు స్పందన లేకపోవడం బాధాకరమని డా. ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని, వెంటనే నవీన్‌ కుటుంబానికి తగిన పరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అటవీ అమరవీరుడు బానోత్‌ నవీన్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడానికి గల కారణాలను ముఖ్యమంత్రి, హోంమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రజలకు వివరించాలని కోరారు.

ఉద్యోగులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది

ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కోరారు. అన్యాయం జరిగితే న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందని తెలిపారు.