ఈ నెల 20న హజ్రత్ బందగీ పాషావలి ఉర్సు ఉత్సవాలు
జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన హజ్రత్ బందగీ పాషావలి దర్గా ఉర్సు ఉత్సవాలను ఈ నెల 20న గురువారం నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ అధ్యక్షుడు షేక్ జునేద్ బాగవాన్, కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం సాయంత్రం హజ్రత్ మాహెబుసుభాని దర్గా నుంచి భాజా భజంత్రీలతో భక్తిశ్రద్ధల మధ్య సందల్‌ను ఊరేగింపుగా తీసుకువచ్చి హజ్రత్ బందగీ పాషావలి దర్గాపై సమర్పించనున్నారు.
అనంతరం బట్టల చాదర్, పూల చాదర్ సమర్పించి సలాం, దువా, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి అన్నదాన కార్యక్రమంతో పాటు ఖవ్వాలి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన తహసిన్ తాజ్, మహారాష్ట్రకు చెందిన షాహేద్ అజ్మీరి ఖవ్వాలి కళాకారులు పాల్గొననున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కులమతాలకు అతీతంగా భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా కమిటీ కోరింది.
