ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవయవ దానంపై అవగాహన
అవయవ దానం.. మహోన్నతమైన జీవన దానం
నంద్యాల రూరల్, ఆంధ్రప్రభ: అవయవ దానం ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు భారత రెడ్ క్రాస్ సొసైటీ, నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ముందుగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అవయవ దానం వల్ల కలిగే ప్రయోజనాలను, ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలకు కొత్త జీవితం అందించవచ్చని వివరించారు. అవయవ దానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, ఇతరుల్లోనూ చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులతో అవయవ దాన ప్రతిజ్ఞ చేయించి, ప్రతిజ్ఞ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం మహిళా సమాఖ్య కార్యదర్శి చెన్నమరాజు వసుంధర దేవి, భారత రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ.. “అవయవ దానం మహోన్నతమైన జీవన దానం” అని పేర్కొన్నారు. అవయవ దానం ద్వారా మరణానంతరం కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారు.
