వ్యవసాయ భూమిలో దంపతుల మృతదేహాలు
మోతె, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలోని వ్యవసాయ భూమిలో భార్యాభర్తల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో లభించడం కలకలం రేపింది. సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి వెంట ఉన్న ఓ వ్యవసాయ భూమిలో కాళ్లు, చేతులు బయటకు కనిపించేలా పాక్షికంగా పాతిపెట్టిన ఆడ, మగ మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రామకృష్ణరెడ్డి, ఎస్‌ఐ లచ్చిరెడ్డి, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి ఆధారాలను సేకరించారు. మృతులను మోతె మండలం బీక్యా తండాకు చెందిన హలావత్ బూబా, నాగు నాయక్‌గా గుర్తించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ ఘటనపై మోతె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఎవరైనా దంపతులను హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పాతిపెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
