ఆలయ చోరీ కేసులో నిందితుడి అరెస్టు
బంగారు ఆభరణాలు, నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం
సదాశివనగర్, ఆంధ్రప్రభ: సదాశివనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వజ్జేపల్లి తాండలో శ్రీ జగదాంబ ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పూరియా నాయక్ తాండకు చెందిన మాలోత్ నవీన్‌ను అరెస్టు చేసి, దొంగిలించిన బంగారు ఆభరణాలు, నగదు, చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బి. సంతోష్ కుమార్ తెలిపారు.
ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక, బయోమెట్రిక్, శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు.
నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పూరియా నాయక్ తాండ నుంచి పల్సర్ 125 ద్విచక్ర వాహనంపై వజ్జేపల్లి తాండకు చేరుకున్న అతడు.. వాహనాన్ని పొలాల సమీపంలో నిలిపి కాలినడకన ఆలయానికి వెళ్లాడు. ఆలయంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం గోడ దూకి లోపలికి ప్రవేశించి, రాయితో షట్టర్ తాళం పగులగొట్టి అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు వెల్లడైంది.
చోరీ చేసిన రెండు బంగారు ఉంగరాలను గాంధారి పట్టణంలోని రాజ్ గోల్డ్ షాప్‌లో విక్రయించి రూ.40,600 పొందినట్లు దర్యాప్తులో తేలింది. మిగిలిన ఆభరణాలను తన ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
గత చోరీలపైనా దర్యాప్తు
నిందితుడిని విచారించగా గతంలోనూ కొన్ని చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆయా కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. గత చోరీలకు సహకరించినట్లు వెల్లడైన అతని మామ అంగోత్ శివలాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
కేసును సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన సదాశివనగర్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అజార్, ప్రభు, నరేష్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. ఆలయాలు, ఇళ్లు, ఇతర ఆస్తుల భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
