యువతను మోసం చేస్తున్న వైఎస్సార్సీపీ
- వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
- డీఎస్సీపై వైసీపీ అవాస్తవ ప్రచారం..
- వాస్తవాలు ప్రజలకు వివరిస్తున్న టీడీపీ
- ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వంపై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తూ యువతను, ప్రజలను మోసం చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆరోపించారు. డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బుధవారం తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ అశోక్‌నగర్ రఘు గార్డెన్స్ ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో గద్దె రామమోహన్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించి వేలాది మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నిర్వహించలేదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు అసూయతో అవాస్తవ ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు.
డీఎస్సీ పరీక్ష రాయనివారిని, యువతకు సంబంధం లేని వ్యక్తులను ముందుకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని గద్దె రామమోహన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని యువత, ప్రజలు వాస్తవాలతో పోల్చి చూడాలని, కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో పొట్లూరి సాయిబాబు, అబ్దుల్ కరీమ్, పఠాన్ హయత్‌ఖాన్, మేదరమెట్ల నారాయణ, బోర్రా బాలు, రాజేశ్వరి, అరుణ, పఠాన్ బాజీ తదితరులు పాల్గొన్నారు.
