పగటిపూట ఇంట్లో చోరీ.. నిందితుడి అరెస్ట్‌

గణపురం, ఆంధ్రప్రభ: పగటిపూట ఇంటి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్‌ చేసి రూ.73 వేల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు గణపురం ఎస్సై అశోక్‌ తెలిపారు. బుధవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

కొండాపూర్‌కు చెందిన దానం సమ్మయ్య ఈ నెల 10న ఇంటికి తాళం వేసి చేపలు పట్టేందుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు, వేలిముద్రలు సేకరించడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు.

ఈ క్రమంలో ఘనపురం గ్రామంలోని ఘనపా సముద్రం చెరువు కట్ట వద్ద పుట్ట రమణాకర్‌ (30)ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.

అతడి వద్ద నుంచి 2.4 గ్రాముల బంగారు చెవి దుద్దులు, 12.05 గ్రాముల బంగారు గొలుసు, 20 తులాల వెండి పట్టీలు, కడియాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చోరీకి గురైన మొత్తం సొత్తు విలువ రూ.80 వేలు కాగా, రూ.73 వేల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అశోక్‌ పేర్కొన్నారు.

ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.