లింగాపూర్ ఉపకేంద్రంలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

దండేపల్లి, ఆంధ్రప్రభ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం దండేపల్లి మండలంలోని లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతీయ నాణ్యత ప్రమాణాల ధ్రువీకరణకు అవసరమైన అన్ని సూచికలు, సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డులు, అవగాహన పోస్టర్లను పరిశీలించారు. టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించి, పిల్లల వివరాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆశా కార్యకర్తలు తల్లిదండ్రులకు సమాచారం అందించాలని, టీకాల వివరాలను యువిన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాణ్యత అధికారి అజ్మీర్ రాజకుమార్, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.