పరమ పవిత్రం శ్రావణమాసం…

  • నేటితో ఆషాడం పూర్తి రేపటి నుండే శ్రావణం ప్రారంభం
  • ముఖ్యమైన పండగలన్నీ ఈ నెలలోనే

మక్తల్, ఆంధ్రప్రభ: హైందవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణమాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆషాఢ మాసం ముగిసిన అనంతరం వచ్చే ఈ మాసం సకల శుభాలకు వేదికగా భావిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో అనేక ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, పూజా కార్యక్రమాలు ఉండటంతో ఆలయాలు, ఇళ్లు భక్తిశ్రద్ధలతో కళకళలాడనున్నాయి.

ప్రత్యేకంగా మహిళలకు శ్రావణమాసం ఎంతో విశిష్టమైనది. ప్రతి సోమవారం, శుక్రవారం, శనివారం రోజులకు ఈ మాసంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా శుభాలు కలుగుతాయని, కుటుంబానికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.

శ్రావణమాసం సకల దేవతలకు ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు జన్మించిన శ్రావణ నక్షత్రం పేరుతో వచ్చిన ఈ మాసం శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదిగా భావిస్తారు. మహాలక్ష్మీదేవి, గౌరీదేవి, సుబ్రహ్మణ్యస్వామి, రాఘవేంద్ర స్వామి వంటి దేవతల ఆరాధనకు కూడా ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది.

శ్రావణమాసాన్ని ‘నభో మాసం’ అని కూడా పిలుస్తారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.

శ్రావణమాసంలో ఎన్నో ముఖ్యమైన పర్వదినాలు వస్తాయి. నాగపంచమి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, గరుడ పంచమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి వంటి పండుగలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

మహాలక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతి శుక్రవారం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని అలంకరించి, దీపారాధన చేసి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు.

శ్రావణమాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ మాసంలోని సోమవారాల్లో భక్తులు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో చేసిన పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. బిల్వపత్రాలు, పుష్పాలతో ఈశ్వరుడిని ఆరాధిస్తారు.

శ్రావణ సోమవార వ్రతాలు ఆచరించడం ద్వారా శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

శ్రావణమాసం ప్రారంభమైన నాలుగో రోజున నాగపంచమి పండుగ వస్తుంది. శివుడి ఆభరణంగా భావించే నాగేంద్రుడిని పూజించడం హైందవ సంప్రదాయంలో భాగం. పాలు, పూలు, నైవేద్యాలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కతో తయారు చేసిన నాగ ప్రతిమలకు అభిషేకాలు నిర్వహిస్తారు.

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా కొత్తగా వివాహమైన మహిళలు తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో నిర్వహిస్తారు. వరాలను ప్రసాదించే అమ్మవారి అనుగ్రహంతో కుటుంబంలో సుఖశాంతులు, సంపద, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం.

శ్రావణమాసం ప్రారంభం కావడంతో నెల రోజుల పాటు ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు తమ ఇష్టదైవాలను దర్శించుకునేందుకు ఆలయాలకు తరలివెళ్తారు.

వివాహాలు, గృహప్రవేశాలు, నోములు, వ్రతాలు, ఇతర శుభకార్యాలకు కూడా శ్రావణమాసం అనుకూలమైనదిగా భావిస్తారు. అందుకే ఈ మాసాన్ని శుభాలకు శ్రీకారం చుట్టే పవిత్ర మాసంగా భక్తులు భావిస్తారు.