పంచాయతీరాజ్‌ కాదు.. ఎమ్మెల్యే రాజ్‌ నడుస్తోంది!

గ్రామ పంచాయతీలకు 29 అధికారాలు బదలాయించాలి..

సర్పంచుల హక్కులు, నిధులను కాపాడాలి

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీలకు సంక్రమించిన 29 అధికారాలను తక్షణమే బదలాయించాలని తెలంగాణ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్‌ చేశాయి.

బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మాట్లాడారు.

కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు రెవెన్యూ గ్రామ హోదా కల్పించాలని, తండాలు, గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరారు. స్థానిక పనుల నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

గ్రామ పంచాయతీలకు సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు నిర్వహణ నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

ఇందిరమ్మ కమిటీల పేరుతో గ్రామ సభ, గ్రామ పంచాయతీల అధికారాలను నిర్వీర్యం చేసే విధానాన్ని రద్దు చేయాలని పురుషోత్తం రెడ్డి కోరారు.

పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదులు ఎమ్మెల్యే రాజ్‌ నడుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ విమర్శించారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను నేరుగా ఎమ్మెల్యేల ఖాతాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.

కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాలకు మళ్లిస్తూ గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. సర్పంచుల అధికారాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని సమావేశంలో కోరారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

గ్రామంలో నిధుల విడుదలకు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ ఇద్దరికే బాధ్యత ఇవ్వాలని, గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శి నందిమల్ల వెంకట్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పలుస శేఖర్‌, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా సర్పంచులు పాల్గొన్నారు.