సింగిల్‌ విండోలపై కాంగ్రెస్‌ నేతల ఆశలు

పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఇవ్వాలని డిమాండ్‌..

చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపికపై ఆశావహుల పైరవీలు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : ప్రాథమిక సహకార సంఘాల సింగిల్‌ విండో సొసైటీల్లో నామినేటెడ్‌ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో ఆశలు పెరిగాయి. చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేటెడ్‌ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు సింగిల్‌ విండో సొసైటీలకు డైరెక్టర్లు, చైర్మన్ల ప్రతిపాదనలను పంపించాలని, స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది.

పార్టీ కోసం కష్టపడ్డ వారితో పాటు చిరకాలంగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్‌ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీకి సేవలు అందించిన వారిని గుర్తించి పదవులు కేటాయించాలని సమావేశంలో కోరినట్లు సమాచారం. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నట్లు తెలిసింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్‌ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట నుంచి డాక్టర్‌ వంశీకృష్ణ, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి డాక్టర్‌ రాజేష్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంపీగా డాక్టర్‌ మల్లు రవి, ఎమ్మెల్సీగా కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కొనసాగుతున్నారు.

జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా విష్ణువర్ధన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న సింగిల్‌ విండో చైర్మన్లు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు సమాచారం.

జిల్లాలో మొత్తం 23 సింగిల్‌ విండో సొసైటీలు ఉన్నాయి. రంగాపూర్, మాచినేనిపల్లి, పెంట్లవల్లి, నర్సాయిపల్లి, అంబటిపల్లి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, తాడూరు, కల్వకుర్తి, గన్యాకుల, తెలకపల్లి, కొండనాగుల, ఉప్పునుంతల, అచ్చంపేట, అమరాబాద్, బిజినేపల్లి, గొరిట, పెద్దకొత్తపల్లి, వెల్దండ, కోడేరు, చారకొండ, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలు ఉన్నాయి.

ఈ 23 సహకార సంఘాలు కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. నామినేటెడ్‌ పద్ధతిలో భర్తీ చేయనున్న నేపథ్యంలో డైరెక్టర్లు, చైర్మన్లతో పాటు డీసీసీబీ డైరెక్టర్లు, డీసీసీబీ చైర్మన్, ఈసీఎంఎస్‌ చైర్మన్, సభ్యుల పదవుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారికి అవకాశం లభించే అవకాశం ఉంది.

దాదాపు 30 నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు పదవులు కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఈ నామినేటెడ్‌ విధానం ఆశావహులకు ఊరటనిస్తోంది. నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో పదవుల ఎంపిక సులభతరమవుతుందని నాయకులు భావిస్తున్నారు.

అయితే నియామకాల్లో రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్‌ అధిష్టానం సూచించినట్లు సమాచారం.

పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం కోసం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను కూడా గుర్తించి పదవులు భర్తీ చేయాలని, సుమారు 60 శాతం మేర ఆ విధానంలో అవకాశాలు కల్పించాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 20 మండలాలు, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు గుర్తింపు లభించి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్‌ ఎన్నికల సమయంలో బుజ్జగింపుల్లో కొందరికి సింగిల్‌ విండో డైరెక్టర్‌ పదవులు ఇస్తామని హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ చైర్మన్ల ఎంపిక సమయంలోనూ పదవులు ఆశించిన నాయకులకు సింగిల్‌ విండో చైర్మన్‌ పదవులు ఇస్తామని పార్టీ నాయకులు చెప్పినట్లు సమాచారం.

ఇప్పుడు అవకాశం రావడంతో అప్పట్లో పదవుల కోసం పోటీ పడిన కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యేలను కలిసి తమకు సింగిల్‌ విండో చైర్మన్‌ పదవులు ఇవ్వాలని కోరే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా జిల్లాలో సింగిల్‌ విండో సొసైటీలకు నామినేటెడ్‌ పద్ధతిలో పదవులు భర్తీ చేయడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొంత ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీ బాధ్యులు ఎప్పుడు అధిష్టానానికి నివేదికలు పంపిస్తారోనని ఆశావహులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.