Indrakeeladri | కనకదుర్గమ్మకు ఆషాఢ సారె వైభవం…

అమ్మవారి సన్నిధిలో మంగళప్రదంగా ముగిసిన మహోత్సవం
నెలరోజుల భక్తి ఉత్సవాలకు ఘన ముగింపు..
వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగిన ఇంద్రకీలాద్రి
అమ్మవారి సేవలో తరించిన ఆలయ సిబ్బంది
సిబ్బంది సమష్టి కృషికి అభినందనలు


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నెలరోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో, సామరస్యపూర్వక వాతావరణంలో ఘనంగా ముగిశాయి. అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ముగింపు వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

దేవస్థానం సిబ్బంది ప్రత్యేక ఆషాడసారె..

ఆషాడ సరె మహోత్సవాల్లో ముగింపు వేడుకల్లో భాగంగా జమ్మిదొడ్డి ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), పాలకమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ఆషాఢ సారె ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో భక్తులు, ఆలయ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ దంపతులు, ఉన్నతాధికారులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. నెలరోజుల పాటు అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు శ్రమించిన సిబ్బందికి ప్రత్యేకంగా సాంప్రదాయబద్ధంగా ఆషాఢ సారెను అందజేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది సేవలను గుర్తించి గౌరవించినట్లయింది.

వేదమంత్రాల నడుమ..

కార్యక్రమంలో ఆలయ వేద పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల వేద మంత్రోచ్ఛారణలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మికతతో మార్మోగింది. వేదఘోషల నడుమ జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా పాల్గొనడంతో కార్యక్రమం సామరస్య స్ఫూర్తిని చాటిచెప్పింది.

ఈసందర్భంగా ఈవో వి.కె. శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ మాట్లాడుతూ… ఆషాఢ సారె ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. దేవస్థానం ప్రస్తుతం నంబర్‌వన్ స్థానంలో నిలవడానికి సిబ్బంది సమష్టి కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. అమ్మవారికి సారె సమర్పించడం అత్యంత పవిత్రమైన, మంగళప్రదమైన కార్యక్రమమని పేర్కొంటూ.. నెలరోజుల పాటు సాగిన ఆషాఢ సారె ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరినీ వారు అభినందించారు. భవిష్యత్తులోనూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా సమష్టిగా పనిచేస్తామని తెలిపారు.