9వ రోజుకు చేరిన ఆయుష్ హౌస్ సర్జన్లు, యూజీ విద్యార్థుల సమ్మె

విద్యార్థుల నిరవధిక సమ్మెకు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సంఘీభావం

కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆసుపత్రి, వరంగల్‌లో ఆయుష్ హౌస్ సర్జన్లు, యూజీ విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వరంగల్ బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆసుపత్రిని సందర్శించారు. సమ్మెలో పాల్గొంటున్న హౌస్ సర్జన్లు, యూజీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, న్యాయమైన డిమాండ్లను తెలుసుకున్నారు.

విద్యార్థులతో మాట్లాడుతూ.. “మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. మీ పోరాటానికి మా వంతు సహకారం అందిస్తాం. మీరు అధైర్యపడవద్దు” అంటూ భరోసా కల్పించారు.

తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు గత అనేక సంవత్సరాలుగా స్టైపెండ్ పెంపు జరగకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని జేఏసీ నాయకులు తెలిపారు. సమాన పనికి సమాన స్టైపెండ్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో నిరవధిక సమ్మె కొనసాగుతోందని వివరించారు.

ఇప్పటికే 9 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన పరిష్కారం రాకపోవడంతో, న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డాక్టర్ రోహిత్ బాస్రే, డాక్టర్ సంగమేశ్వర్, డాక్టర్ గణేష్, డాక్టర్ శేషు, డాక్టర్ పద్మాక్షి, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ అంజలి, డాక్టర్ సబా సమ్రిన్ తదితరులు పాల్గొన్నారు.