ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ
పాత నేరస్తులపై నిఘా ఉంచాలి..
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
ఖమ్మం, ఆంధ్రప్రభ : నేరాల పరిశోధన, నిందితుల గుర్తింపును వేగవంతం చేయడానికి నేరాలు, నేరస్తుల సమాచార వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీసు అధికారులను ఆదేశించారు.

బుధవారం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాధిత ఫిర్యాదుదారులతో మాట్లాడారు.
అనంతరం పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, నేరాలు, నేరస్తుల సమాచార వ్యవస్థలో వివరాల నమోదు, సాధారణ డైరీ రికార్డులు, స్వాధీనం చేసుకున్న వాహనాలు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నేరాలు, నేరస్తుల సమాచార వ్యవస్థలో వస్తున్న అధునాతన పద్ధతులను అందిపుచ్చుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్లలో సమాచారం నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
జిల్లాలో వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ఈ ప్రాజెక్టులో నూతన పద్ధతులను ప్రవేశపెడుతున్నారని, వాటిపై సిబ్బంది పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.
ఉన్నతాధికారులు ఈ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని, తద్వారా కింది స్థాయి సిబ్బంది కూడా మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రాజెక్టులో భాగంగా ఈ-సమన్లు, ఈ-సాక్ష్య వంటి సదుపాయాలను విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, త్రీ టౌన్ సీఐ మోహన్ బాబు పాల్గొన్నారు.
