ఎల్‌నినో ప్రభావం.. రైతులకు శాపం
- ఆగస్టు, సెప్టెంబరులో వర్షపాతం తగ్గే అవకాశం..
- ప్రత్యామ్నాయ పంటలతో నష్ట నివారణ సాధ్యం
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించాలని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం కదిరి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎల్‌నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వర్షాభావాన్ని తట్టుకునే డ్రైల్యాండ్ టెక్నాలజీలు, పంటల నిర్వహణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ, పరిశోధన సంచాలకులు డాక్టర్ వి. సుమతి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ డి. సంపత్‌కుమార్, అత్యల్ప వర్షపాత మండలం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ వి. జయలక్ష్మి, కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తక్కువ కాలంలో పండే రకాలకు ప్రాధాన్యం..
వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తక్కువ వ్యవధిలో పంటకు వచ్చే, బెట్టును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. కొర్రలోని ‘గరుడ’ రకం సుమారు 60 రోజుల్లో కోతకు వస్తుందని, బెట్టును తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని వివరించారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితుల్లో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా కంది, సజ్జ, కొర్ర, ఉలవలు, పెసర వంటి పంటలను సాగు చేసుకోవచ్చని తెలిపారు.
వేరుశనగ, ఆముదంపై ప్రత్యేక దృష్టి..
ప్రస్తుతం వేరుశనగ, ఆముదం పంటలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతులు పంటల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కరువు ప్రభావాన్ని తగ్గించి మొక్కల ఎదుగుదల, దిగుబడిని మెరుగుపరచేందుకు ఆకులపై పోషక ద్రావణాలను పిచికారీ చేయాలని తెలిపారు. పొటాషియం నైట్రేట్ లేదా 19-19-19 నీటిలో కరిగే ఎరువును లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చని సూచించారు.
పొలాల్లో పరిశీలన..
అవగాహన కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు రైతుల పొలాల్లో సాగవుతున్న వేరుశనగ పంటలను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటకు ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట ఎదుగుదలకు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు సూచనలు, సలహాలు అందించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి వినియోగం, పోషక యాజమాన్యంపై రైతులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు సోదరులు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
