సేవకు సత్కారం.. అటవీ అధికారి సుబూర్‌కు అభినందనలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: విధి నిర్వహణలో అంకితభావం, బాధ్యతతో పనిచేస్తూ అటవీ సంరక్షణకు విశేష సేవలు అందిస్తున్న అచ్చంపేట అటవీశాఖ రేంజ్ అధికారి మహమ్మద్ సుబూర్‌కు గుర్తింపు లభించింది. అటవీశాఖ నుంచి ఉత్తమ అధికారిగా ప్రశంసలు అందుకున్న సందర్భంగా అచ్చంపేట వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.
బుధవారం ఉదయం రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన మార్నింగ్ వాక్ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. నిత్యం తమతో కలిసి మార్నింగ్ వాక్‌లో పాల్గొనే మహమ్మద్ సుబూర్‌ను వాకర్స్ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ సంరక్షణలో ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
