టెసెరాక్ట్ వ్యవహారంపై కేటీఆర్ ఫైర్..
ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ డిమాండ్
రక్షణ రంగ సంస్థ, ప్రభుత్వ భూముల అంశాలను ప్రస్తావిస్తూ..
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్టార్టప్‌ల ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన టీ-హబ్ లక్ష్యాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం కొందరు కుటుంబాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన కేటీఆర్.. టీ-హబ్ ద్వారా నిజమైన స్టార్టప్‌ల అభివృద్ధికి బాటలు వేశామని, అయితే ప్రస్తుతం “అనుముల హబ్‌లు” అనే విధానానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ భూముల కేటాయింపులపై ప్రశ్నలు
కుటుంబ ఆధారిత వ్యాపారాలకు తక్కువ ధరలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి అవకాశాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, తెలంగాణ యువతకు కూడా ప్రభుత్వ భూములు, వనరులను వినియోగించుకునే మార్గాలను వివరించాలని ఆయన కోరారు.
టెసెరాక్ట్ కంపెనీపై కేటీఆర్ వ్యాఖ్యలు
‘టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ఎలాంటి పెట్టుబడి లేకుండా రక్షణ రంగ సంస్థను నిర్మించి భారీ లాభాలు సాధించారని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతకు ప్రభుత్వ భూముల కేటాయింపుల విధానంపై అవగాహన కల్పించాలని కేటీఆర్ అన్నారు.
రాజకీయంగా వేడెక్కుతున్న భూముల అంశం
ప్రభుత్వ భూముల కేటాయింపులు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే కేటీఆర్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
