Local-Body-Elections : జ‌మిలి ఛాన్స్‌ Andhra Prabha Top Story

Local-Body-Elections : జ‌మిలి ఛాన్స్‌ Andhra Prabha Top Story

  • పుర పల్లె పోరు ఒకేసారి
  • శ్రీ సత్యసాయిలో రాజకీయ వేడి
  • కోర్టు గేట్లు తెరిస్తే.
  • బ్యాలెట్‌ బాక్సులే!
  • 6 మున్పిపాలిటీ
  • 465 పంచాయతీల్లో కదలిక
  • టిక్కెట్లాట షురూ
  • ప‌ట్ట‌ణాల్లో ప‌రుగో ప‌రుగు
  • ప‌ల్లెల్లో లెక్క‌లే లెక్క‌లు

(శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ)

స్థానిక సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఒక్కొక్కటిగా తొలగి, అవసరమైన ప్రక్రియలు పూర్తయితే పల్లె, పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై కసరత్తు సాగుతుండగా.. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ఆశావహులు తమ రాజకీయ లెక్కలు వేసుకుంటున్నారు. సర్పంచ్‌ నుంచి కౌన్సిలర్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు పదవుల కోసం పోటీ పడే వారి సంఖ్య పెరుగుతోంది.జిల్లాలో హిందూపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి పురపాలక సంస్థలు, పెనుకొండ, మడకశిర పట్టణ సంస్థలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం జిల్లాలో ఆరు పురపాలక/పట్టణ సంస్థలు ఉన్నాయి.

Local-Body-Elections : కోర్టు తీర్పే కీలకం!

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానంగా న్యాయపరమైన అంశాలే కీలకంగా మారాయి. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియలు పూర్తయితే ఎన్నికల నిర్వహణకు మార్గం మరింత సుగమం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఎన్నికలు జరగని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలను కూడా ఎన్నికల పరిధిలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Local-Body-Elections : పట్టణాల్లో పరుగో ప‌రుగు…

హిందూపురం నుంచి మడకశిర వరకు.. ధర్మవరం నుంచి పుట్టపర్తి వరకు స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కౌన్సిలర్‌ టికెట్‌ కోసం నేతల చుట్టూ తిరుగుతున్న ఆశావహులు.. వార్డు స్థాయిలో తమ బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణాల్లో రిజర్వేషన్లు ఎటువైపు మారతాయన్నది ఆశావహుల భవిష్యత్తును నిర్ణయించనుంది.

Local-Body-Elections : పల్లెల్లో లెక్కలే లెక్క‌లు.

గ్రామ పంచాయతీ ఎన్నికలపైనా ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రక్రియ, ఎన్నికల సన్నద్ధతపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలపై గ్రామాల్లో ఇప్పటికే రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ఏ గ్రామంలో ఎవరి బలం ఎంత? గత ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంది? ఈసారి ఎవరు బరిలోకి దిగుతారు? అన్నదానిపై ప్రధాన పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు.

Local-Body-Elections : జిల్లా పరిషత్‌ పైనా ఫోక‌స్ …

జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో పరిషత్‌ ఎన్నికలపైనా ఆసక్తి పెరిగింది. పంచాయతీ, పురపాలక ఎన్నికలతోపాటు పరిషత్‌ ఎన్నికలపై కూడా స్పష్టత వస్తే జిల్లాలో గ్రామస్థాయి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది.

Local-Body-Elections : కూటమి,,వైసీపీ. మ‌ధ్యే

రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా స్థానిక ఎన్నికల్లో వ్యక్తిగత పరిచయాలు, గ్రామస్థాయి బలాబలాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అధికార కూటమి ఇప్పటికే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. వైసీపీ స్థానిక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలచుకునే వ్యూహంలో ఉంది. ఇతర పార్టీలు, స్వతంత్ర ఆశావహులు కూడా తమకు అనుకూలమైన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాయి.

Local-Body-Elections :టిక్క‌ట్లాట షురూ

స్థానిక ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా తెరలేవకముందే జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఎవరికి ఏ వార్డు? ఏ గ్రామంలో ఎవరు బలమైన అభ్యర్థి? ఏ సామాజిక సమీకరణం ఎవరికి కలిసొస్తుంది? అన్న లెక్కలతో ప్రధాన పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ వేడి మరింత పెరిగే అవకాశముంది
స్థానిక ఎన్నికల సన్నాహాల్లో ఓటర్ల జాబితా కీలకం కానుంది. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల వారీగా ఓటర్ల జాబితాల తయారీకి చర్యలు చేపట్టింది.

Local-Body-Elections : త్వ‌ర‌లోనే నగారా.

కోర్టు వివాదాలు, పునర్విభజన, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల వంటి ప్రక్రియలు పూర్తయ్యే కొద్దీ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. అయితే ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి తేదీని ఖరారైనదిగా భావించరాదు.