ఆదర్శ పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
కుంటాల, ఆంధ్రప్రభ: తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయమైన బోనాల వేడుకలను కుంటాల మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకునే ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎత్రాజ్ రాజు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు బోనాలను నెత్తిన ఎత్తుకొని స్థానిక గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి ఆలయాలకు తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
