ఎవరూ లేని వాడిగా 85 ఏళ్ల వృద్ధుడి ఆక్రందన

ఆదుకునే వారి కోసం ఎదురుచూపు

వేల్పూర్ ఆంధ్రప్రభ: అందరూ ఉండి కూడా ఎవరూ లేనివాడిలా.. 85 ఏళ్ల చంద్రయ్య అలియాస్‌ రాజన్న జీవితం మారిపోయింది. వేల్పూర్‌ మండలం జాన్కంపేట్‌ గ్రామ సొసైటీ ఆవరణలో మంచంపై కూర్చుని చేతులు జోడించి ఆదుకోవాలని వేడుకుంటున్న ఆయనను చూసి స్థానికులు చలించిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు చంద్రయ్య తెలిపారు.

చందూర్‌ స్వస్థలం.. ఆస్తి దూరం

చంద్రయ్య స్వస్థలం చందూర్‌ గ్రామం. తండ్రి అనంతయ్య. తనకు వివాహం కాలేదని, తల్లిదండ్రుల స్థిరాస్తిని అక్కలు తీసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు అక్కలు ఉన్నారని, వారిలో కమలవ్వ మృతి చెందగా, మరో అక్క లచ్చవ్వ చందూర్‌లో ఉంటున్నారని తెలిపారు. లచ్చవ్వ కుమారుడు శంకర్‌, కమలవ్వ కుమారులు సుదర్శన్‌, గోపాల్‌ కూడా చందూర్‌ ప్రభుత్వ పాఠశాల సమీపంలో నివసిస్తున్నట్లు చెప్పారు.

మూడు రోజులుగా ఆకలితో..

వృద్ధాప్యం, అనారోగ్యంతో నడవలేని స్థితికి చేరుకోవడంతో గ్రామ పెద్దలు చంద్రయ్యను జాన్కంపేట్‌ సొసైటీ ఆవరణలో ఉంచారు. ఇన్నాళ్లు ఎవరో ఒకరు అన్నం పెడుతూ ఆదుకునేవారని, అయితే గత మూడు రోజులుగా సరైన ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నానని ఆయన దీనంగా చెప్పారు.

“అధికారులు, పోలీసు అధికారులు చొరవ తీసుకుని నన్ను చందూర్‌లో ఉన్న నా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలి” అని చంద్రయ్య కోరారు. తన కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించడం లేదని వాపోయారు.

ఒంటరిగా, అనాథలా మిగిలిపోయిన ఈ వృద్ధుడిని ఆదుకునేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.