గుండెపోటును గ్యాస్ట్రిక్‌గా భావించొద్దు.. ప్రతి నిమిషం కీలకమే..

  • 100 శాతం ఎల్‌ఏడీ బ్లాక్‌..
  • 19 నిమిషాల్లో స్టెంట్‌
  • వరుసగా 33 కార్డియాక్‌ అరెస్టులు..
  • 33సార్లు డీసీ షాక్‌లు
  • సకాలంలో అత్యవసర యాంజియోప్లాస్టీతో ప్రొఫెసర్‌కు పునర్జన్మ

(విజయవాడ, ఆంధ్రప్రభ) ; ఛాతీలో మంట, నొప్పిని గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో విజయవాడలోని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌లో చోటుచేసుకున్న అరుదైన వైద్య ఘటన మరోసారి హెచ్చరించింది. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రికి చేరుకున్న ఓ ప్రొఫెసర్‌కు ఏకంగా 33 సార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవించినప్పటికీ వైద్య బృందం అత్యవసర చికిత్సతో ప్రాణాలు కాపాడింది. గుండె రక్తనాళంలో 100 శాతం బ్లాక్‌ను గుర్తించి ఆసుపత్రికి చేరుకున్న 19 నిమిషాల్లోనే అత్యవసర స్టెంట్‌ యాంజియోప్లాస్టీ నిర్వహించడం కీలకంగా మారింది.

విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో డీన్‌గా, మలేసియాలోని యు.ఎం.కే. యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న దిరిశాల విజయ్‌రామ్‌ జూలై 30న ఛాతీలో మంట, నొప్పితో బాధపడ్డారు. తొలుత దీనిని గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి సమీపంలోని వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకున్నారు. అయినప్పటికీ ఉపశమనం లేకపోవడంతో రాత్రి 11 గంటల సమయంలో ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌కు చేరుకున్నారు.

రెండు నిమిషాల్లోనే గుండె ఆగింది..

ఆసుపత్రికి చేరుకున్న రెండు నిమిషాల్లోనే ఆయనకు తీవ్రమైన యాంటీరియర్‌ వాల్‌ హార్ట్‌ అటాక్‌తో పాటు కార్డియాక్‌ అరెస్ట్‌, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ (వీఎఫ్‌) సంభవించింది. ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టులు డాక్టర్‌ పొట్లూరి అర్చనా రత్న, డాక్టర్‌ మధుకృష్ణ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే పునరుజ్జీవన చర్యలు చేపట్టింది.

ఇంటుబేషన్‌ చేసి వెంటిలేటర్‌పై ఉంచడంతో పాటు నిరంతరం కొనసాగుతున్న వీఎఫ్‌ను నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. అత్యంత విషమ పరిస్థితుల్లోనే రోగిని క్యాథ్‌ ల్యాబ్‌కు తరలించి ఇంట్రా-అయోర్టిక్‌ బెలూన్‌ పంప్‌ (ఐఏబీపీ) అమర్చారు. నిర్వహించిన యాంజియోగ్రామ్‌లో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ఎల్‌ఏడీ ధమనిలో 100 శాతం అడ్డంకి ఉన్నట్లు గుర్తించారు. ఆలస్యం చేయకుండా అత్యవసర స్టెంట్‌ యాంజియోప్లాస్టీ నిర్వహించారు.

33సార్లు డీసీ షాక్‌లు..

స్టెంట్‌ అమర్చే ప్రక్రియలోనే రోగికి 33సార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవించగా ప్రతిసారీ డీసీ షాక్‌ అందించాల్సి వచ్చింది. అయినప్పటికీ వైద్య బృందం నిరంతర పర్యవేక్షణతో చికిత్స కొనసాగించింది. ఆసుపత్రికి చేరుకున్న 19 నిమిషాల్లోనే స్టెంట్‌ అమర్చడం ద్వారా రక్తప్రసరణ పునరుద్ధరించగలిగారు. 48 గంటల్లో ఐఏబీపీని తొలగించగా, నాలుగో రోజుకే రోగి స్వయంగా నడిచే స్థితికి చేరుకున్నట్లు వైద్యులు తెలిపారు.

‘గ్యాస్‌’ అనుకుని వదిలేయొద్దు..

ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ ఛాతీలో నొప్పి, బరువు, ఒత్తిడి, చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను గ్యాస్ట్రిక్‌ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఈసీజీ చేయించుకుని కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలని, స్థానిక చికిత్సలతో సమయం వృథా చేయకుండా అత్యవసర కార్డియాక్‌ సదుపాయాలున్న ఆసుపత్రికి చేరుకోవాలని తెలిపారు.

గుండెపోటు చికిత్సలో ప్రతి నిమిషం కీలకమని, ‘టైమ్‌ ఈజ్‌ మజిల్‌’ అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడం, ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు వైద్యుల సలహా మేరకు గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఆసుపత్రిలో 24 గంటలూ, ఏడాది పొడవునా ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. 14 మంది ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టులతో ఏడు బృందాలు, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు, రెండు క్యాథ్‌ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పత్రికా సమావేశంలో పలువురు కార్డియాలజిస్టులు, క్రిటికల్‌ కేర్‌, అత్యవసర వైద్య నిపుణులు పాల్గొన్నారు.