అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట ఏది..?

మంటలు చెలరేగితే దేవుడే దిక్కు
అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట ఏది..?
టేకుమట్లలో అగ్నిమాపక కేంద్రం లేక అవస్థలు
దూర ప్రాంతం నుంచి ఫైర్‌ ఇంజన్‌ వచ్చేలోపే భారీ నష్టం..
ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం

టేకుమట్ల ఆంధ్రప్రభ: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రతి నిమిషం ఎంతో కీలకం. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ టేకుమట్ల మండలంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. స్థానికంగా అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే దూర ప్రాంతం నుంచి ఫైర్‌ ఇంజన్‌ వచ్చేలోపే మంటలు ఉధృతమై ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన ప్రతిసారీ స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

అగ్ని రగిలితే.. అంతే!

ఇళ్లలో దొంగతనం జరిగితే కొంతమేర ఆస్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ అగ్ని ప్రమాదం సంభవిస్తే ఇంట్లో ఉన్న సర్వస్వం క్షణాల్లో కాలిబూడిదవుతుంది. టేకుమట్ల మండలంలో తరచూ చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తమవంతుగా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన తర్వాత దూర ప్రాంతంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాల్సి వస్తోంది. ఫైర్‌ ఇంజన్‌ చేరుకునేలోపు మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో నష్టం తీవ్రత పెరుగుతోంది.

ఫైర్‌ ఇంజన్‌ వచ్చేసరికి.. బూడిదే!

గత ఏడాది మండల కేంద్రంలోని మారుతి బట్టల దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్‌ ఇంజన్‌ సంఘటనా స్థలానికి చేరుకునేలోపే దుకాణం పూర్తిగా దగ్ధమై బూడిదగా మారింది.

అగ్నిమాపక సిబ్బంది చేరుకున్న తర్వాత మిగిలిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బాధితులు దుకాణంలోని సరుకును పూర్తిగా కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. ఈ ఘటన స్థానికంగా అగ్నిమాపక కేంద్రం అవసరాన్ని మరోసారి చాటిచెప్పింది.

ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం

జిల్లా పరిధిలో అగ్నిమాపక కేంద్రాల కొరత ఉండటంతో మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్‌ ఇంజన్‌ సంఘటనా స్థలానికి చేరుకునేలోపు మంటల తీవ్రత పెరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

గతంలో చిట్యాల ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని చెబుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ఉన్నతాధికారులు స్పందించి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు అంశాన్ని చర్చించడం, ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

స్థానికంగా ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలి

టేకుమట్ల మండలంలో స్థానికంగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ ఇంజన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి టేకుమట్ల మండలానికి అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఫైర్‌ స్టేషన్‌ అందుబాటులో లేకే నష్టం తీవ్రత

“దగ్గరలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో దూర ప్రాంతం నుంచి ఫైర్‌ ఇంజన్‌ రావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈలోపు మంటలు విస్తరించి ఆస్తి నష్టం భారీగా జరుగుతోంది. స్థానికంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి నష్టాన్ని తగ్గించవచ్చు. పాలకులు ఈ సమస్యపై దృష్టి సారించాలి” అని స్థానికులు కోరుతున్నారు.