కొడాలి నాని వ్యాఖ్యలకు గుడివాడ ఎమ్మెల్యే రాము కౌంటర్
డీఎస్సీ నిరసనలపై వైసీపీ నేతల తీరును తప్పుబట్టిన ఎమ్మెల్యే
గుడివాడ, ఆంధ్రప్రభ: డీఎస్సీ నిరసనలపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు గుడివాడ ఎమ్మెల్యే రాము ఘాటుగా స్పందించారు. గుడివాడ మండలం జొన్నపాడులో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము, ఎస్‌డబ్ల్యూసీ చైర్మన్ రావి పలు అంశాలపై స్పందించారు.
అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తోందని రాము అన్నారు. వైసీపీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో డీఎస్సీ అభ్యర్థులు మాత్రమే కాకుండా కనీసం విద్యావంతులు కూడా కనిపించడం లేదని విమర్శించారు. ‘జెన్-జి’ ఆందోళనల పేరుతో వృద్ధ నేతలు, రాజకీయ నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని వ్యాఖ్యానించారు.
డీఎస్సీ విషయంలో తప్పులు జరగలేదని కోర్టులు చెబుతున్నప్పటికీ వైసీపీ నేతలు సీబీఐ విచారణ కోరుతున్నారని రాము అన్నారు. డీఎస్సీ అంశంలో వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కోర్టు నిర్ణయాలను కూడా పట్టించుకోకుండా నిరసనలకు దిగుతున్నారని విమర్శించారు.
సీబీఐ విచారణకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, అయితే గతంలో గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారం, మట్టి తవ్వకాలపై కూడా విచారణ జరగాలని రాము డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అరెస్టులు లేవని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపైనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంటే వైసీపీ నేతలకు నచ్చడం లేదని ఎమ్మెల్యే రాము విమర్శించారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసినప్పటికీ వైసీపీ నేతలు ముందుకు రావడం లేదన్నారు. సంబంధిత అంశంపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతలు గత ప్రభుత్వ పాలనను ఒకసారి గుర్తు చేసుకోవాలని రాము సూచించారు. తమపై గతంలో అన్యాయంగా ఎన్నో కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాటం నుంచి వెనక్కి తగ్గలేదన్నారు. ప్రభుత్వ అనుమతి లేని కార్యక్రమాలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం సహజ ప్రక్రియేనని తెలిపారు.
గుడివాడలో ఎవరినీ పోలీసులు అడ్డుకోలేదని, నిబంధనల ప్రకారం పోలీసులు తమ విధులు నిర్వహించారని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా వైసీపీ నేతలు విమర్శలకే పరిమితమవుతున్నారని ఆయన ఆరోపించారు
