నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు
కలెక్టర్ డీకే బాలాజీ
పెనమలూరు, ఆంధ్రప్రభ: ఘన వ్యర్థాల నిర్వహణలో బల్క్ వేస్ట్ జనరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. తమ ప్రాంగణాల్లోనే తడి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సోమవారం తాడిగడప మున్సిపాలిటీలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఘన వ్యర్థాల నిర్వహణ కేవలం పరిశుభ్రతకు సంబంధించిన అంశం కాదని, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
నిబంధనలను ఉల్లంఘించే బల్క్ వేస్ట్ జనరేటర్లపై అవసరమైన సందర్భాల్లో విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసే స్థాయిలో చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ముందుగా బల్క్ వేస్ట్ జనరేటర్లకు నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించి, తమ ప్రాంగణాల్లోనే వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించుకునేలా ప్రోత్సహించాలన్నారు.
15 నుంచి 20 రోజుల గడువు
ప్రతి బల్క్ వేస్ట్ జనరేటర్‌కు నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలను వివరిస్తూ నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు 15 నుంచి 20 రోజుల గడువు ఇవ్వాలని సూచించారు.
గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలు పాటించని సంస్థలపై విద్యుత్, నీటి సరఫరా నిలిపివేతతో పాటు నిబంధనల ప్రకారం తదుపరి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
తడి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువు
బల్క్ వేస్ట్ జనరేటర్లు తమ ప్రాంగణాల్లోనే తడి వ్యర్థాలను ప్రాసెస్ చేసి సేంద్రీయ ఎరువుగా తయారు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆ ఎరువును ఆయా ప్రాంగణాల్లోని మొక్కలు, తోటలకు వినియోగించుకోవచ్చన్నారు. దీనివల్ల సంస్థలకు ఉపయోగకరమైన ఎరువు లభించడంతో పాటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలపై వ్యర్థాల నిర్వహణ భారం తగ్గుతుందని చెప్పారు.
గ్రీన్ రిచ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శన
తడి వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి సేంద్రీయ ఎరువుగా మార్చే విధానంపై చెన్నైకి చెందిన గ్రీన్ రిచ్ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.
అయితే ఏ సంస్థ సాంకేతిక పరిష్కారాన్ని వినియోగించుకోవాలనే విషయంలో బల్క్ వేస్ట్ జనరేటర్లకు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని కలెక్టర్ తెలిపారు. సదుపాయాలు ఏర్పాటు చేసి నిబంధనలు పాటించడం మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
స్వచ్ఛ ఆంధ్రలో కీలక భాగం
ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కీలక భాగమని కలెక్టర్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ తమ పరిధిలోని బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి, వ్యర్థాల వేర్పాటు, తడి వ్యర్థాల ప్రాసెసింగ్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
బల్క్ వేస్ట్ జనరేటర్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అన్నారు. కృష్ణా జిల్లాను పరిశుభ్రమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం.ధనలక్ష్మి, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, డివిజనల్ అధికారులు, డీఎల్‌పీవోలు, 25 మండలాల డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, బల్క్ వేస్ట్ జనరేటర్ల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
