విజయవాడ నగర కాంగ్రెస్ నూతన కమిటీకి ఆమోదం..
మరోసారి నగర కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నరహరిశెట్టి నరసింహారావు
విజయవాడ నగరంలోని 64 డివిజన్లకు డివిజన్ అధ్యక్షుల నియామకం
(విజయవాడ, ఆంధ్రప్రభ) : త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రెడ్డి విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని అధికారికంగా ఆమోదించారు. విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి నరసింహారావు మరోసారి నియామకం అయ్యారు.
నరహరిశెట్టికే మరోసారి..
విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా నరహరిశెట్టి నరసింహారావు నియామకంతో పాటుగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శి, కోశాధికారి లతో కూడిన 36 మంది పేర్లతో జాబితాను శ్రీమతి వైయస్ షర్మిలారెడ్డి ఆమోదించి ఆదివారం విడుదల చేశారు. అదేవిధంగా విజయవాడ నగరంలోని 64 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను సైతం నియమిస్తూ వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో మరింత బలంగా…
ఈ మేరకు నగర కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ…విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం మరియు ప్రజలకు మరింత చేరువగా పార్టీని తీసుకెళ్లే దిశగా నూతన కమిటీ సమిష్టిగా కృషి చేస్తుందన్నారు. నూతన కమిటీకి ఆమోదం తెలిపిన ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రెడ్డికి విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు.
