దేవస్థాన అభివృద్ధికి అండగా ఉంటా..!
అమ్మవారి దేవస్థాన నూతన కమిటీకి ఎంపీ కేశినేని చిన్ని శుభాకాంక్షలు
విజయవాడ, ఆంధ్రప్రభ: వన్‌టౌన్‌లోని శ్రీ నగరాల సీతారామస్వామి–శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన నూతన కమిటీకి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పోతిన భేషు, కంటేశ్వరుడు అధ్యక్షతన ఏకగ్రీవంగా ఏర్పడిన నూతన కమిటీ సభ్యులు,ఎంపీ కార్యాలయంలో ఎంపీ చిన్ని ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎంపీ చిన్ని ఆశీర్వదిస్తూ.. దేవస్థానం అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. దేవస్థాన అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఏ సమయంలోనైనా తన సహాయం అవసరమైతే తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.
దేవస్థానం అభివృద్ధితో పాటు నగర యువత భవిష్యత్తుపైనా ప్రత్యేక దృష్టి సారించిన ఎంపీ చిన్ని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు. దేవస్థానం నిర్వహణకు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి అవసరమైన అనుమతులు, సహకారం అందేలా కృషి చేసిన ఎంపీ చిన్ని గారికి నగర కుల పెద్దలు, నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎంపీని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రాబోయే దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు కూడా అవసరమైన సహకారం అందిస్తానని ఎంపీ చిన్ని హామీ ఇవ్వడంతో నూతన కమిటీ సభ్యులు, నగర పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “నగర కుల అభివృద్ధి – దేవస్థాన అభివృద్ధి – యువత భవిష్యత్తు” అనే లక్ష్యంతో నూతన కమిటీ సమిష్టిగా ముందుకు సాగాలని నిర్ణయించింది.
నూతన కమిటీకి ఎంపీ కేశినేని చిన్ని శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీ సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ సమావేశాన్ని పిళ్లా శ్రీనివాసరావు సమన్వయం చేశారు. పోతిన భేషు, కంటేశ్వరుడు అధ్యక్షతన 27 మంది నూతన కమిటీ సభ్యులను ఎంపీ చిన్ని గారికి పరిచయం చేశారు. కార్యక్రమంలో రాయిన ఆది బాబు, పలుకు రమా, బేవర సుధాకర్, కొరగంజి భాస్కరరావు, తమ్మిన సూర్యకుమారి, పిల్ల రవి తదితరులు పాల్గొన్నారు.
