కలిదిండిలో సీఎం చంద్రబాబు ‘వన్ డే’..

  • ఆరు గంటల పాటు పర్యటన
  • రైతులతో ముఖాముఖి.. ప్రజా వేదికలో స్టాళ్ల సందర్శన
  • కూటమి క్యాడర్‌తో ప్రత్యేక సమావేశం..
  • పర్యటనపై సర్వత్రా ఆసక్తి
  • సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, కూటమి నేతలు

కైకలూరు టౌన్, ఆంధ్రప్రభ : కైకలూరు నియోజకవర్గ చరిత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మరో కీలక ఘట్టంగా నిలవనుంది. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో సీఎం దాదాపు ఆరు గంటల పాటు పర్యటించనున్నారు. రైతులు, ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు నేరుగా మమేకమయ్యేలా పర్యటన షెడ్యూల్‌ రూపొందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రైతులతో ముఖాముఖి

ఉదయం 10.45 గంటలకు కలిదిండి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు సీఎం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి 11 గంటల నుంచి 11.45 గంటల వరకు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సాగునీరు, పంటల సాగు, మార్కెటింగ్‌, గిట్టుబాటు ధరలు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు సంక్షేమ పథకాలు తదితర అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది.

ప్రజా వేదికలో సుదీర్ఘ కార్యక్రమం

రైతులతో సమావేశం అనంతరం ఉదయం 11.55 గంటలకు కలిదిండి గ్రామంలోని పాత పోస్టాఫీసు వెనుక ఏర్పాటు చేసిన ప్రజా వేదికకు సీఎం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.05 గంటల వరకు అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్‌, రవాణా, వైద్య సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

కూటమి శ్రేణులతో ప్రత్యేక భేటీ

మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం 2.55 గంటలకు వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలోని వేదిక వద్ద ఏర్పాటు చేసిన కూటమి శ్రేణుల సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం 4.25 గంటల వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కూటమి శ్రేణుల మధ్య సమన్వయం తదితర అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

ఏర్పాట్లపై ఎమ్మెల్యే కామినేని ప్రత్యేక దృష్టి

సీఎం పర్యటన నేపథ్యంలో కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి కూడా పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. కూటమి నేతలు గ్రామాల వారీగా ప్రజలు, కార్యకర్తలను సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హెలిప్యాడ్‌, రూట్‌మ్యాప్‌, సభా వేదికలు, పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత, విద్యుత్‌, వైద్య, పారిశుధ్య ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసు అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

సాయంత్రం 4.40 గంటలకు తిరుగు ప్రయాణం

షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరే సీఎం 10.45 గంటలకు కలిదిండి చేరుకోనున్నారు. రైతులతో సమావేశం, ప్రజా వేదిక కార్యక్రమం, కూటమి శ్రేణులతో భేటీ అనంతరం సాయంత్రం 4.40 గంటలకు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం కానున్నారు. దాదాపు ఆరు గంటలపాటు సీఎం కలిదిండిలో పర్యటించనుండటంతో నియోజకవర్గ ప్రజలు, కూటమి శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.