వైద్యులకు భద్రతే ‘అభయ’

నంద్యాల నూనెపల్లె, ఆంధ్రప్రభ: విధి నిర్వహణలో ఉన్న మహిళా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో నంద్యాల ప్రసూతి, స్త్రీ వ్యాధి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ‘అభయ డే’ నిర్వహించారు. 2024లో కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన మహిళా వైద్యురాలి హత్య ఘటనను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా జాతీయ గైనకాలజీ వైద్యుల సంఘం (ఫాగ్సీ) పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టారు.

సంఘం అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమన్నారు. వైద్య సిబ్బంది భయాందోళనలకు గురికాకుండా పనిచేసేలా సురక్షిత వాతావరణం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక జాతీయ చట్టం తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు.

రోగి మరణం లేదా ఇతర వైద్యపరమైన ఇబ్బందుల సందర్భంలో ఆసుపత్రుల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన ప్రామాణిక విధివిధానాలు రూపొందించాలని కోరారు. కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 2008 ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి, వైద్యులపై భౌతిక దాడులకు పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న రెండేళ్ల జైలు శిక్షను ఏడేళ్లకు పెంచాలని సూచించారు. ఇటువంటి కేసులను నాన్‌బెయిలబుల్‌గా నమోదు చేసేలా చట్టాన్ని కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నంద్యాల గైనకాలజీ వైద్యులు పాల్గొన్నారు.