మందర్నా మంజీర నుంచి ఇసుక అక్రమ రవాణా

  • సెలవు రోజుల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
  • చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

బోధన్ రూరల్, ఆంధ్రప్రభ: బోధన్ మండలం మందర్నా గ్రామంలో మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వరుస సెలవు రోజులను ఆసరాగా చేసుకుని ఇసుక తరలింపుదారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. మంజీర నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక తరలిస్తున్న వాహనాలకు గుర్తింపు నంబర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన సమయంలో వాటిని గుర్తించడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అక్రమ ఇసుక రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు మంజీర పరిసర ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్రామస్తులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంజీర నది నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.