దులీప్ ట్రోఫీకి మరింత ప్రాధాన్యం

  • మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం..
  • ఫైనల్‌ను స్టేడియంలో నిర్వహించే యోచన

ఆంధ్రప్రభ : దేశవాళీ క్రికెట్‌ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్‌ ట్రోఫీకి ఈసారి మరింత ఆదరణ కల్పించేందుకు బీసీసీఐ చర్యలు చేపడుతోంది. ఈ సీజన్‌లో గతంతో పోలిస్తే ఎక్కువ మ్యాచ్‌లను టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తెలిపారు. 2025-26 దులీప్‌ ట్రోఫీ సందర్భంగా అభిమానులు నిరాశకు గురయ్యారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో జరిగిన టోర్నీకి ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో పాటు తొలి రౌండ్‌ మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కాలేదు.

అయితే 2026-27 సీజన్‌ దులీప్‌ ట్రోఫీలో పరిస్థితి మారనుంది. ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో మరిన్ని మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సైకియా వెల్లడించారు. ‘‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రాంగణాన్ని వినియోగించడంలో కొన్ని ప్రభుత్వ పరిమితులు ఉన్నాయి. అందువల్ల అక్కడ ప్రేక్షకులను అనుమతించడం సాధ్యం కావడం లేదు. అయితే ఈసారి ఎక్కువ మ్యాచ్‌లను ప్రసారం చేయడం ద్వారా అభిమానులకు తమ అభిమాన ఆటగాళ్లను చూసే అవకాశం కల్పిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు.

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ను ప్రేక్షకులు కూర్చునే సాధారణ స్టేడియంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని సైకియా చెప్పారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఉందని, ప్రతిపాదనను పరిశీలిస్తామని తెలిపారు. దేశవాళీ క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించడంతో పాటు యువ ఆటగాళ్ల ప్రతిభను అభిమానులకు చేరువ చేయడమే లక్ష్యంగా బీసీసీఐ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.