లారీ ఢీకొని వ్యక్తి మృతి
మరిపెడ, ఆంధ్రప్రభ: లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట జాతీయ రహదారి 563పై ఈ ప్రమాదం జరిగింది.
ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం దంతకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బ తండాకు చెందిన బానోతు వెంకట్రాం (45) వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య కూలి పనులకు వెళ్లగా, వెంకట్రాం స్ప్రే పంపు మరమ్మతు చేయించేందుకు బైక్‌పై మరిపెడ బంగ్లాకు వచ్చాడు.
మరమ్మతు అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట వెనుక నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రాం తలపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదం అనంతరం లారీని ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికుల సహాయంతో ఎస్సై సతీష్, సిబ్బంది యల్లంపేట స్టేజీ సమీపంలో లారీని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు వెంకట్రాంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
