యువతను మత్తుకు బానిస చేసింది వైసీపీనే: జనసేన నేతలు

  • కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
  • పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేసే ముందు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు

మంగళగిరి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో యువత, అభివృద్ధి అంశాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మాల వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డా. పెదపూడి విజయ్‌కుమార్‌, జనసేన రాష్ట్ర కార్యదర్శి, మాదిగ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బేతపూడి విజయ్‌శేఖర్‌ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని వారు తెలిపారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారని జనసేన నేతలు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో పవన్‌ కల్యాణ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 8,571 కిలోమీటర్ల సీసీ రోడ్లు, వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. అలాగే ‘అటవితల్లి బాట’ కార్యక్రమం కింద డోలీ రహిత గ్రామాల కోసం 2,710 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగానే ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ మేరకు దృష్టి పెట్టారో చెప్పాలని వారు ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష నేతలు గుర్తించాలని సూచించారు.

ఎమ్మెల్యే చంద్రశేఖర్‌పై విమర్శలు..

ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ గెలిచిన తర్వాత ప్రజా సమస్యలపై ఎంతమేరకు స్పందించారో చెప్పాలని జనసేన నేతలు ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకు కనిపించడం లేదా అని నిలదీశారు. శాసనసభకు హాజరు, సంతకాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే నైతిక అర్హత చంద్రశేఖర్‌కు లేదని వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితం కావడం సరికాదని హితవు పలికారు. జగన్‌ను మెప్పించేందుకు విమర్శలు చేయడం మానుకుని, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.

జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమానికి ఎందుకు రాలేదు?

మార్కాపురంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులకు శంకుస్థాపన నిర్వహించిన సమయంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను అధికారికంగా ఆహ్వానించినప్పటికీ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని జనసేన నేతలు ప్రశ్నించారు. నిజంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలపై ఆసక్తి ఉంటే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండేదన్నారు.

ఎమ్మెల్యే పట్టించుకోకపోయినా ఆయన నియోజకవర్గంలో దాదాపు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు.

‘జెన్‌ జీ’పై వైసీపీ వ్యాఖ్యలు విడ్డూరం..

వైసీపీ నాయకులు ‘జెన్‌ జీ వార్‌’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అయితే గత ఐదేళ్ల పాలనలో యువత కోసం సకాలంలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారా అని జనసేన నేతలు ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేశారని ఆరోపించారు. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ విషయంలోనూ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

యువత మాదకద్రవ్యాల వైపు మళ్లకుండా చర్యలు తీసుకోవడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రయత్నించిన అధికారులపై బదిలీల పేరుతో చర్యలు తీసుకున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారే ఇప్పుడు ‘జెన్‌ జీ’ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన..

వైసీపీ నేతలు రాజకీయ విమర్శలకు బదులుగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జనసేన నేతలు సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచుతూ, ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

పవన్‌ కల్యాణ్‌ శస్త్రచికిత్స అనంతరం కొద్ది రోజులకే తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని జనసేన నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిని రాజకీయ కారణాలతో విమర్శించడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.