ఎల్‌నినో ప్రభావం.. రైతులకు ముందస్తు అవగాహన

మైలవరం, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని శుక్రవారం మైలవరం మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ప్రగతిశీల రైతులతో కలిసి ప్రతి రైతు కుటుంబాన్ని, ప్రతి రైతు కమతాన్ని సందర్శించి ఖరీఫ్‌ సీజన్‌ మొత్తం పంటల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు.

వర్షపు నీటి సంరక్షణ, నీటి పొదుపు పద్ధతులు, మట్టి పరీక్షలు, పంటల మార్పిడి, సూక్ష్మ సాగునీటి వినియోగం, వాతావరణ హెచ్చరికల ఆధారంగా వ్యవసాయ నిర్వహణ, పంటల ఆరోగ్య పర్యవేక్షణ, వ్యవసాయ సమాచార సేవలు, పంటల విపత్తు నిర్వహణ సేవల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.

వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు. మైలవరం రైతు సేవా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు అధ్యక్షుడు కరెడ్ల వెంకటనారాయణ, సొసైటీ బ్యాంకు డైరెక్టర్ ఒరుగు వెంకటేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షుడు ఒరుగు సాంబశివరావు, రైతు శిక్షణ కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకుడు పి.మౌనిష, మైలవరం సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎం.శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి కే.సంధ్యారాణి, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.