ఎల్కతుర్తిలో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ఇందిరానగర్–గోపాలపూర్ మధ్య హై లెవల్ బ్రిడ్జికి రూ.1.50 కోట్లు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (రోడ్స్) శాఖ జి.ఓ. ఆర్‌టీ. నెం.425, తేదీ: 06-08-2026 ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ క్రమంలో ఎల్కతుర్తి మండలంలోని ఇందిరానగర్ నుంచి గోపాలపూర్ వరకు హై లెవల్ బ్రిడ్జి (హెచ్‌ఎల్‌బీ) నిర్మాణానికి రూ.1.50 కోట్ల పరిపాలనా అనుమతి లభించింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుందని స్థానికులు భావిస్తున్నారు.
ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారుతుండగా, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలతో పాటు రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవల వాహనాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఎల్కతుర్తి మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎల్కతుర్తి మండల ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
