తిలారులో నేతన్న సేవలో మంత్రి అచ్చెన్నాయుడు…

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
జగన్, ధర్మాన సోదరులపై తీవ్ర ధ్వజం


కోటబొమ్మాళి, ఆగస్టు 7 (ఆంధ్రప్రభ): తరతరాల ప్రజలు చెప్పుకునేలా జిల్లాను అభివృద్ధి చేయడానికి తాను, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని తిలారులో నేతన్న సేవలో అనే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి మంజూరైన 3.62 కోట్ల రూపాయల చెక్కులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. చిన్న బమ్మిడి, పెద్ద బమ్మిడి, నారాయణపురం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు.

అంతకుముందు సుమారు ఏడు కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ వసతి గృహాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులు సమీక్షించారు. వీధుల్లో ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా సభా వేదిక వద్ద ఎంపీపీ తర్ర రామకృష్ణ ఆధ్వర్యంలో తెర ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధి పై వీడియో ప్రదర్శించడంతో మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఐదేళ్లూ రాష్ట్రాన్ని పట్టించుకోని గొడ్డ‌లి పార్టీ అధ్య‌క్షునికి నేడు రాజకీయ విమర్శలు చేసే నైతిక హక్కు లేద‌ని ధ్వజమెత్తారు.

చేనేత కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట:
చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. చేనేత రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ రాయితీలు, ఆర్థిక సహాయం వంటి చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

తిలారు కోనేరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా:
తిలారు కోనేరును అభివృద్ధిపరిచి కోనేటి గట్టును చిల్డ్రన్ పార్క్ గా మార్చి, పార్క్ కుర్చీలు, విద్యుత్తు దీపాలు ఏర్పాటుచేసి సుందరీకరిస్తానని మంత్రి తెలిపారు. రేగులపాడు మీదుగా జర్జంగి-పిండ్రువాడ రహదారికి అనుసంధానం చేయడం తన జీవిత ఆశయాల్లో ఒకటని తెలిపారు. ఈ మార్గంలో అవసరమైన చోట వంతెన నిర్మాణం చేపడితే రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు, ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా గౌరమ్మపేట రహదారి, తిలారులోని పెద్దవీధి, సూరపు వీధి రోడ్లు బాగు చేస్తామని తెలిపారు. తాగు నీరు, సాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తానని మంత్రి తెలిపారు.

మొండి గోడలతో’నాడు-నేడు’ పనులు:
గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పేరుతో సుమారు రూ.5,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో పనులు పూర్తికాక కేవలం మొండి గోడలు మాత్రమే మిగిలాయని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. పాఠశాలల్లో చిన్న బోల్ట్, తలుపు వంటి వస్తువు అవసరమైనా స్థానికులకు పనులు ఇవ్వకుండా కేంద్రీకృత విధానంలో వ్యవహరించారని ఆరోపించారు. ఏ గ్రామానికి వెళ్లినా పూర్తికాని హైస్కూల్ భవనాలు కనిపిస్తున్నాయని, పాఠశాలల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని పనులను పూర్తి చేసేందుకు త్వరలో ప్రత్యేక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు పాఠశాల భవనాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

హామీల అమలులో ప్రభుత్వం ముందంజ:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి రెండు మినహా దాదాపు అన్నింటినీ ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నికలు సమీపించిన సమయంలో మాత్రమే పింఛన్లు పెంచారని, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.4,000కు, దివ్యాంగుల పింఛన్లను రూ.6,000కు పెంచిందని చెప్పారు. ప్రత్యేక వర్గాలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

జగన్, ధర్మాన సోదరులపై మంత్రి ధ్వజం:
గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్, జిల్లాకు చెందిన వైసిపి నేతలు ధర్మాన సోదరులు ఇప్పుడు డీఎస్సీ పై ఆరోపణలు చేయడం విడ్డూరమని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వారు ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు 2018లోనే పునాది వేశామ‌ని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లు పట్టించుకోలేదని విమర్శించారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రెండేళ్లపాటు కృషి చేసి ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వకపోయినా, మంత్రి నారా లోకేష్ బాబు ‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,700కు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని మంత్రి తెలిపారు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించి, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టుల్లో వందల సంఖ్యలో కేసులు వేశారని మంత్రి ఆరోపించారు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా యువతకు ఉద్యోగాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం:
తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా పయనిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, మండల టిడిపి అధ్యక్షులు బోయిన సత్య శ్రీనివాస్, పి ఎస్ సి ఎస్ అధ్యక్షురాలు వి. విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.