నందివాహనంపై మల్లేశ్వరుల ఊరేగింపు..

నందివాహనంపై మల్లేశ్వరుల ఊరేగింపు..
ఇంద్రకీలాద్రిపై చైత్ర బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ
సంప్రదాయ కళల సందడి
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి పై జరుగుతున్న శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరుల చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజు సందర్భంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పండితులు మూలమంత్ర హవనాలు నిర్వహించారు. సాయంత్రం ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిపూర్వకంగా జరిగాయి. అనంతరం మల్లేశ్వర మహామండపం నుంచి నందివాహన సేవ ఘనంగా ప్రారంభమైంది.
నందీశ్వరుడు శివుని వాహనంగా, కైలాస లోక సేనాధిపతిగా భావించబడుతూ, భక్తి, నిష్ఠకు ప్రతీకగా నిలుస్తాడు. శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేసి, ఎల్లప్పుడూ శివసేవలో ఉండే వరం పొందిన నంది, శివాలయాల్లో గర్భగుడి వైపు కూర్చుని జీవాత్మ శివునిపై దృష్టి పెట్టాలని సూచిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నందివాహనంపై అమ్మవార్లు, స్వామి కొలువై ఉండగా, ముందుగా తప్పెట్లు, మహిళల కోలాటాలు, చిన్నారుల నృత్యాలు, తాళం భజనలతో సంప్రదాయ కళలు ఆకట్టుకున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నందివాహన సేవ ప్రారంభమై భక్తులను అలరించింది.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వాహణాధికారి వికె శీనా నాయక్, స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందివాహనం కనకదుర్గానగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ బజార్ మార్గాల్లో ఊరేగింది. మార్గమధ్యంలో మహిళలు పసుపు నీళ్లతో రహదారులను శుద్ధి చేసి, హారతులు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి జయజయధ్వానాలు చేశారు. ఈ వేడుకల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు.
