ఏపీకి 14 కొత్త డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు…
పార్లమెంట్‌లో ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్రం కీలక ప్రకటన
జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స సేవల విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
దేశవ్యాప్తంగా 524 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు..
అవసరమైతే మరిన్ని కేంద్రాలకు ఆమోదం
రోగులకు స్థానికంగానే నాణ్యమైన చికిత్స అందించడమే లక్ష్యం : కేంద్ర మంత్రి జేపీ నడ్డా
(విజయవాడ, ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ రోగులకు జిల్లా స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రానికి 14 కొత్త డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లోక్‌సభలో వెల్లడించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. లోక్‌సభలో ఎంపీ చిన్ని డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు, దేశవ్యాప్తంగా కేంద్రాల సంఖ్య, భవిష్యత్ విస్తరణపై ప్రశ్నించగా, కేంద్ర మంత్రి సమగ్ర వివరాలు వెల్లడించారు.
2025–26 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన లక్ష్యానికి అనుగుణంగా మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 524 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు పనిచేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 23 కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. అదనంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 14 కొత్త కేంద్రాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి కొత్త కేంద్రం ఏర్పాటుకు రూ.2.40 కోట్లు, రెండో సంవత్సరం నుంచి నిర్వహణ కోసం ఏడాదికి రూ.1.49 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని వివరించారు.
అంటువ్యాధులు కాని వ్యాధుల నివారణ, నియంత్రణ జాతీయ కార్యక్రమం (NP-NCD) కింద రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాల ఆధారంగా ప్రతిపాదనలు పంపితే, నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి మరిన్ని డే కేర్ క్యాన్సర్ కేంద్రాలకు కూడా ఆమోదం తెలుపుతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 313 కొత్త కేంద్రాలకు ఆమోదం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు వల్ల రోగులకు తమ ప్రాంతానికే సమీపంలో నాణ్యమైన చికిత్స అందుబాటులోకి వస్తుందని, దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు, చికిత్స వ్యయం గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 14 కొత్త కేంద్రాలను మంజూరు చేయడం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మరిన్ని డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి నిరంతరం తీసుకెళ్తానని ఎంపీ చిన్ని తెలిపారు.
